

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరో అంతస్తులోని గది నంబర్ 33లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాల కొరత వల్ల ప్రజలు, రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించనున్నారు.
తాగునీటి సరఫరా, నీటి వనరుల పరిరక్షణ, సాగునీటి అవసరాలకు విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక వంటి అంశాలపై రాజకీయ పార్టీల నేతల నుంచి ప్రభుత్వం సలహాలు, సూచనలు స్వీకరించనుంది. కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు, ముందస్తు చర్యలపై అఖిలపక్ష నేతల అభిప్రాయాలను తెలుసుకోనుంది. రాష్ట్రంలో కరువు నివారణకు చేపట్టే చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రభుత్వం కోరనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!