

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సీఈఓ పదవి నుంచి తొలగించిన పరాగ్ అగర్వాల్ ఇప్పుడు ఏఐ రంగంలో సరికొత్త విజయాన్ని సాధించారు. ట్విట్టర్ నుంచి వైదొలిగిన అనంతరం ఆయన స్థాపించిన ప్యారలల్ వెబ్ సిస్టమ్స్ తాజాగా 100 మిలియన్ డాలర్ల సిరీస్ బీ పెట్టుబడులను సమీకరించింది. దీంతో సంస్థ విలువ 2 బిలియన్ డాలర్లకు, అంటే సుమారు రూ.19,020 కోట్లకు చేరింది. ఏఐ ఏజెంట్లు ఇంటర్నెట్లో సమాచారాన్ని వేగంగా శోధించి, సేకరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది.
ట్విట్టర్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించిన తర్వాత అగర్వాల్ తిరిగి ఉద్యోగంలో చేరకుండా సొంత సంస్థను నిర్మించడంపై దృష్టి పెట్టారు. 2025 నవంబర్‌లో సంస్థ విలువ 740 మిలియన్ డాలర్లుగా ఉండగా, కేవలం కొన్ని నెలల్లోనే తాజా పెట్టుబడులతో 2 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ విజయాన్ని ఆయన కెరీర్లో చెప్పుకోదగిన పునరాగమనంగా టెక్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!