

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు మోటరోలా దూకుడుగా ముందుకు సాగుతోంది. దేశంలో మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం శాంసంగ్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉండగా, వివో, ఒప్పో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. తాజా ఐడీసీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 8.8 శాతం మార్కెట్ వాటాతో మోటరోలా ఐదో స్థానానికి చేరుకుంది. విభిన్న ఉత్పత్తులు, ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి, దూకుడైన మార్కెటింగ్ వ్యూహాలతో ఒప్పోను అధిగమించి మూడో స్థానానికి చేరుకోవచ్చని కంపెనీ ఆశిస్తోంది.
మోటరోలా వృద్ధికి ప్రధానంగా ఎడ్జ్, రేజర్, సిగ్నేచర్ సిరీస్‌లలోని ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు కీలకంగా నిలుస్తున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి తమ ఆదాయం ఇరవై రెట్లు పెరిగిందని, ప్రస్తుతం అందులో దాదాపు 60 శాతం అధిక ధరల విభాగంలోని ఫోన్ల నుంచే వస్తోందని కంపెనీ వెల్లడించింది. స్థానిక తయారీ వ్యవస్థను బలోపేతం చేయడం కూడా ఈ వృద్ధికి దోహదపడుతోంది. త్వరలో విడుదల కానున్న ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోటరోలా సిగ్నేచర్ 27ను నోయిడాలోని తయారీ కేంద్రంలో రూపొందించనున్నారు. డిక్సన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న నియోలింక్‌తోనూ మోటరోలా తయారీ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. ఈ కేంద్రాలు దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికా మార్కెట్లకు ఫోన్లను ఎగుమతి చేస్తున్నాయి. ఈ తయారీ కార్యకలాపాల ద్వారా దాదాపు 8,000 మందికి ప్రత్యక్షంగా, 56,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
మార్కెట్‌లో తన ఉనికిని పెంచుకునేందుకు మోటరోలా సేవల నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 620 నగరాల్లోని 716 పిన్‌కోడ్ ప్రాంతాలకు సేవలు అందిస్తోంది. ఇందుకోసం 846కు పైగా సర్వీస్ టచ్‌పాయింట్లు, 685 ప్రత్యేక రిపేర్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికతపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది. గూగుల్‌తో భాగస్వామ్యం ద్వారా రాబోయే సిగ్నేచర్ 27లో జెమినీ ఇంటెలిజెన్స్‌ను అందించనుంది. అలాగే, వివిధ పరికరాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు వినియోగదారులకు ఉత్పాదకత సాధనాలను అందించేందుకు ‘కైరా’ (Qira) అనే తన సొంత ఏఐ అసిస్టెంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ప్రీమియం ఫోన్లు, స్థానిక తయారీ, ఏఐ సాంకేతికతతో భారత మార్కెట్‌లో మరింత పట్టు సాధించాలని మోటరోలా భావిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!