

ఆపిల్ తన ఉత్పత్తుల విడుదల వ్యూహంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2027 ఫిబ్రవరి-మార్చి మధ్య ఐఓఎస్ 27.4 అప్‌డేట్ సమయంలో పలు బడ్జెట్ ఉత్పత్తులను ఒకేసారి మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ తన ‘పవర్ ఆన్’ న్యూస్‌లెటర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కొత్త లైనప్‌లో ఐఫోన్ 18, ఐఫోన్ 18ఈ, బడ్జెట్ ఐప్యాడ్, మ్యాక్‌బుక్ నియో 2, కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రో మోడళ్లతో పాటే సాధారణ ఐఫోన్‌ను కూడా సెప్టెంబర్‌లో విడుదల చేస్తూ వచ్చిన ఆపిల్.. ఇకపై ప్రీమియం మోడళ్లను ముందుగా, సాధారణ మోడళ్లను మరుసటి ఏడాది వసంతకాలంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రో సిరీస్‌కు వేరుగా సాధారణ ఐఫోన్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి కానుంది.
ఈ లైనప్‌లో ఐఫోన్ 18పై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఇందులో టీఎస్‌ఎంసీ 2 నానోమీటర్ టెక్నాలజీతో రూపొందించే ఏ20 చిప్‌ను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, పరికరంలోనే ఏఐ ఫీచర్ల వినియోగం మెరుగుపడవచ్చని అంచనా. ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్‌ను కూడా కొత్తగా, విమానం కిటికీ ఆకారాన్ని పోలిన డిజైన్‌లో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మ్యాక్‌బుక్ నియో 2లో ఏ18 ప్రో చిప్ స్థానంలో ఏ19 ప్రో చిప్‌ను, 8 జీబీ యూనిఫైడ్ మెమరీ స్థానంలో 12 జీబీ మెమరీని అందించే అవకాశం ఉంది. కొత్త రంగుల ఎంపికలను కూడా పరిచయం చేయవచ్చని తెలుస్తోంది. అయితే మెమరీ పెంపు కారణంగా ధరను సుమారు 50 డాలర్లు పెంచి 749 డాలర్లకు నిర్ణయించే అంశాన్ని ఆపిల్ పరిశీలిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.
2027 తొలి అర్ధభాగం చివర్లో ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో ఐప్యాడ్ ఎయిర్, కొత్త ఐప్యాడ్ ప్రో, ఐఫోన్ ఎయిర్ 2 విడుదలయ్యే అవకాశముంది. ఇక ఏడాది ద్వితీయార్థంలో కొత్త ఆపిల్ వాచ్, ఐఫోన్ 20, స్మార్ట్ గ్లాసెస్, కెమెరాలతో కూడిన ఎయిర్‌పాడ్స్‌ను పరిచయం చేయవచ్చని అంచనాలున్నాయి. ఉత్పత్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది పొడవునా విడతలవారీగా కొత్త పరికరాలను విడుదల చేయడం ద్వారా అమ్మకాల వేగాన్ని కొనసాగించాలని ఆపిల్ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వ్యూహం వల్ల కంపెనీ ఆదాయం ఏడాది ద్వితీయార్థంపైనే ఎక్కువగా ఆధారపడకుండా ఉండవచ్చని అంచనా. అయితే సాధారణ ఐఫోన్ విడుదల ఆలస్యం వినియోగదారుల కొనుగోళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మ్యాక్‌బుక్ నియో 2 ధర పెరిగితే విద్యార్థుల నుంచి వచ్చే డిమాండ్ ఎలా ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వివరాలపై ఆపిల్ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!