

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుఫాన్ల ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో రెండు నుంచి మూడు తుఫాన్లు ఏర్పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. నవంబర్ నెలాఖరులో ఒక తుఫాను ఏర్పడవచ్చని, డిసెంబర్ మొదటి వారం తర్వాత మరో తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగాధిపతి ఆచార్య సీవీ నాయుడు పేర్కొన్నట్లు కథనంలో వెల్లడించారు. సముద్రంలో అనుకూల పరిస్థితులు కొనసాగితే మూడో తుఫాను ఏర్పడే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
దక్షిణ బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం, ఈశాన్య రుతుపవనాల ద్వారా సముద్రంలో తేమ పెరగడం వల్ల అల్పపీడనాలు ఏర్పడి బలపడే అవకాశం ఉందని నిపుణులు వివరిస్తున్నారు. అయితే, ఈ వాతావరణ వ్యవస్థలు ఏ దిశగా కదులుతాయనే దానిపై ఇప్పుడే స్పష్టత లేదని చెబుతున్నారు. తుఫాన్ల కదలికను బట్టి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ప్రభావం ఉండవచ్చు. తీర ప్రాంత ప్రజలు, రైతులు వాతావరణ శాఖ అధికారిక హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!