

అడోబ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన విస్తృత సర్వే ఆధారంగా తన తొలి క్రియేటర్స్ టూల్‌కిట్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఈ నివేదికలో కంటెంట్ క్రియేటర్లు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఎలా స్వీకరిస్తున్నారో వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది క్రియేటర్లు ఇప్పటికే కంటెంట్ సృష్టి కోసం AI టూల్స్‌ను ఉపయోగిస్తున్నారని, కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ ఈ సాంకేతికత క్రియేటర్ ఎకానమీ వృద్ధికి దోహదపడుతోందని నివేదిక పేర్కొంది.
భారత్, అమెరికా, యూకే, జపాన్, జర్మనీ సహా పలు దేశాలకు చెందిన 16,000 మందికి పైగా క్రియేటర్ల అభిప్రాయాలతో ఈ సర్వే నిర్వహించారు. ముఖ్యంగా భారతీయ క్రియేటర్లు AI పట్ల ఎంతో సానుకూల దృక్పథం కలిగి ఉన్నట్లు అడోబ్ వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 97 శాతం మంది AI వల్ల క్రియేటర్ ఎకానమీకి లాభం చేకూరిందని భావించగా, 95 శాతం మంది తమ వ్యాపారం మరియు ఫాలోవర్ల వృద్ధిని వేగవంతం చేయడంలో AI సహాయపడిందని తెలిపారు. అలాగే 85 శాతం మంది AI లేకపోతే సాధ్యంకాని కంటెంట్‌ను సృష్టించగలిగామని చెప్పారు. కంటెంట్ ఎడిటింగ్, ఎన్హాన్స్మెంట్, అప్‌స్కేలింగ్, చిత్రాలు వీడియోల తయారీ, ఐడియా బ్రెయిన్‌స్టార్మింగ్ వంటి అవసరాల కోసం AI ని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. క్రియేటివ్ శైలిని అర్థం చేసుకుని పనిచేసే ఏజెంటిక్ AI పై కూడా క్రియేటర్లు పెద్ద ఆసక్తి చూపుతున్నారని తెలిపింది.
అయితే కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. సుమారు 78 శాతం మంది తమ అనుమతి లేకుండానే తమ కంటెంట్‌ను AI ట్రైనింగ్‌కు ఉపయోగిస్తారేమోనని భయపడుతున్నట్లు చెప్పారు. అలాగే అధిక ఖర్చులు, అవుట్‌పుట్ నాణ్యతలో అస్థిరత, AI మోడళ్ల ట్రైనింగ్‌పై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు కూడా క్రియేటర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సర్వేను గతేడాది సెప్టెంబర్‌లో ‘ది హారిస్ పోల్స్’తో కలిసి నిర్వహించగా, ప్రధానంగా సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో యాక్టివ్‌గా ఉండే అభివృద్ధి చెందుతున్న మరియు సెమీ-ప్రొఫెషనల్ క్రియేటర్లపై దృష్టి సారించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!