

సౌతాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించడంతో పాటు ఏడు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ముల్డర్ 11 ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 2025లో జింబాబ్వేతో జరిగిన టెస్టులో అతడు అజేయంగా 367 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో టెస్టు కెరీర్‌లో ట్రిపుల్ సెంచరీతో పాటు ఏడు వికెట్ల ప్రదర్శనను నమోదు చేసిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ముల్డర్ 178 బంతుల్లో 100 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఏడు వికెట్లు సాధించిన ఐదో ఆటగాడిగా మరో ఘనత అందుకున్నాడు.
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 219 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా పేసర్లు మార్కో యాన్సెన్ (3/17), కాగిసో రబాడ (3/23), అన్రిచ్ నోర్జే (2/10) ధాటికి బంగ్లాదేశ్ 91 పరుగులకే ఆలౌటైంది. అనంతరం సౌతాఫ్రికా 494/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 184 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో 77.78 శాతం పాయింట్లతో సౌతాఫ్రికా తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు బంగ్లాదేశ్ ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!