

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్ఠాత్మక ‘టైమ్’ మ్యాగజైన్ రూపొందించిన ‘టైమ్ 100 నెక్స్ట్ ఇండియా’ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ, వివిధ రంగాల్లో మార్పునకు కారణమవుతున్న అసాధారణ నాయకులు, ప్రతిభావంతులతో ఈ జాబితాను రూపొందించారు. భారత్‌లో ఈ తరహా ప్రత్యేక జాబితాను ‘టైమ్’ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇందులో క్రీడా రంగానికి చెందిన తొమ్మిది మందికి స్థానం లభించింది. వైభవ్‌తో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఒలింపిక్ పతక విజేతలు లవ్లీనా బోర్గోహెయిన్, మీరాబాయి చాను, ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్, అథ్లెట్ విద్య రామరాజ్, ఆర్చర్ కుమ్కుమ్ మొహోద్, హాకీ మాజీ గోల్‌కీపర్ సవితా పూనియా, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ జాబితాలో చోటు సంపాదించారు.
వైభవ్ సూర్యవంశీ సాధించిన ఈ గుర్తింపుపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ప్రశంసలు కురిపించాడు. వైభవ్ మారుతున్న నవ భారతానికి ప్రతీక అని అభివర్ణించాడు. మైదానంలో బ్యాట్‌తో తనదైన ఆటతీరును ప్రదర్శిస్తూ, భిన్నంగా ఆలోచించే వారిదే భవిష్యత్తు అని వైభవ్ నిరూపిస్తున్నాడని పేర్కొన్నాడు. యువ క్రికెటర్ ప్రతిభ, ఆలోచనా విధానం దేశంలో వస్తున్న మార్పులకు నిదర్శనమని ఆయుష్మాన్ కొనియాడాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!