

యాషెస్ టెస్టులు ప్రపంచ క్రికెట్లో ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తాయి. ఆస్ట్రేలియా–ఇంగ్లాండ్ మధ్య 1882లో ప్రారంభమైన ఈ ఆయుధరహిత యుద్ధం, ప్రతి రెండేళ్లకోసారి అభిమానుల్లో హై వోల్టేజ్ ఆసక్తి రేపుతుంది. తాజా 74వ యాషెస్ టెస్టులోనూ అదే చెమ్మగిల్లే సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
మ్యాచ్ మొదలైన వెంటనే ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను ఊపిరాడనివ్వకుండా దాడి చేసి మొదటి ఇన్నింగ్స్‌ను 172 పరుగులకే ముగించారు. కానీ ఆ తర్వాత ఇంగ్లాండ్ పేసర్లు ప్రతీకారం తీర్చుకున్నట్టే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను కేవలం 132 పరుగులకే కూలగొట్టారు. రెండో రోజు ఇంగ్లాండ్ తిరిగి బ్యాటింగ్ మొదలుపెట్టినప్పటికీ, ఆస్ట్రేలియా బౌలర్లు మరింత ఆగ్రహంగా దాడి చేశారు. ఫాస్ట్ బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ బ్యాటర్లు నిలబడలేక 164 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
204 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా, ఆరంభం నుంచే మ్యాచుపై పూర్తి పట్టు సాధించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ అసలు ఊపందుకున్నాక ఇంగ్లాండ్ బౌలర్లకు కనీస అవకాశం ఇవ్వలేదు. 83 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 123 పరుగుల దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. లాబుషేన్ 51 పరుగులతో సహకరించగా, ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలోనే 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!