

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన కంగారూలు, అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులోనూ 82 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 3-0తో ముందుగానే కైవసం చేసుకున్నారు. 435 పరుగుల భారీ లక్ష్యంతో ఐదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 352 పరుగులకే ఆలౌటైంది. జాక్ క్రాలీ (85), జెమీ స్మిత్ (60), విల్ జాక్స్ (47) కొంత పోరాడినప్పటికీ, ఆస్ట్రేలియా బౌలర్లు ఒత్తిడిని పెంచడంతో ఇంగ్లాండ్ పూర్తిగా తేలిపోయింది.
ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 271/4తో ఆటను కొనసాగించి 349 పరుగులకు ఆలౌటైంది. మంచి స్థితిలో ఉన్న కంగారూలు ఒక దశలో 311/4 వద్ద ఉన్నప్పటికీ, త్వరితగతిన 6 వికెట్లు కోల్పోయి పెద్ద స్కోరు చేజార్చుకున్నారు. ట్రావిస్ హెడ్ (170) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. జోష్ టంగ్ (4/70), బ్రైడన్ కార్స్ (3/80) ఆసీస్ ను కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 371, ఇంగ్లాండ్ 286 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 106, రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఉత్సుకతను రేకెత్తిస్తున్నప్పటికీ, యాషెస్ టైటిల్‌ను మాత్రం ఆస్ట్రేలియా ముందుగానే సొంతం చేసుకుంది. నాల్గో టెస్టు డిసెంబర్ 26న మెల్బోర్న్లో ప్రారంభం కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!