

భారత్–దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ చివరి పోరుకు విశాఖపట్టణం సిద్ధమైంది. మొదటి రెండు మ్యాచ్‌లు భారీ స్కోర్లతో ఉత్కంఠను పెంచగా, ఇరు జట్లూ చెరో విజయం సాధించి సిరీస్‌ను 1-1 తో సమం చేశాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగే నిర్ణాయక మ్యాచ్ పై అందరి దృష్టి నిలింది. ఈ కీలక పోరుకు ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదిక అవుతోంది.
ఇటీవల టెస్టు సిరీస్‌ను 0-2 తో కోల్పోయిన భారత్ పై ఒత్తిడి ఎక్కువైంది. కనీసం వన్డే సిరీస్‌ను గెలిచి అభిమానులకు ఊరట ఇవ్వాలని టీమ్ భావిస్తోంది. మరోవైపు రాయ్‌పూర్‌లో 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా మంచి జోష్‌లో ఉంది. అందుకే నిర్ణాయక మ్యాచ్‌ను సొంతం చేసుకుని పరిమిత ఓవర్ల సిరీస్‌ను కూడా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
1986–87 తర్వాత స్వదేశంలో భారత్ ఒకేసారి టెస్టు మరియు వన్డే సిరీస్‌లను కోల్పోని విషయం గమనార్హం. కాబట్టి ఈ పోరాటం మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.
సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కీలక భూమిక పోషించాల్సి ఉంటుంది. విరాట్ తన గత మూడు వన్డేల్లో ఒక ఫిఫ్టీ, రెండు సెంచరీలు నమోదు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. విశాఖపట్టణంలో ఆయన రికార్డు మరింత బలంగా ఉంది. అక్కడ ఆడిన ఏడు వన్డేల్లో మూడు శతకాలు సాధించి, 97.83 సగటుతో రాణించాడు. ఈసారి కూడా అభిమానులు మరో సెంచరీ కోసం ఎదురు చూస్తున్నారు.
రోహిత్ ఇటీవల నాలుగు వన్డేల్లో ఒక సెంచరీ, రెండు ఫిఫ్టీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఓపెనర్ జైస్వాల్ బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా నిరాశపరుస్తుండడం జట్టు ఆందోళనగా మారింది. లెఫ్ట్ఆర్మ్ పేసర్లను అతను సరిగా ఎదుర్కొనలేకపోతున్నాడు. మరోవైపు రుతురాజ్ శతకంతో ఫారంలోకి రావడం సానుకూల అంశం.
మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్ ఫామ్‌లో లేకపోవడం జట్టు పై ప్రభావం చూపుతోంది. అతని స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తే బ్యాటింగ్ బలోపేతం కావడంతో పాటు స్పిన్ ఎంపికలు పెరుగుతాయని కోచ్ గంభీర్ భావిస్తున్నారు. రిషబ్ పంత్ కూడా ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాడు.
పేసర్ల విషయంలో అర్ష్‌దీప్ తప్ప మిగతా బౌలర్లు పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నారు. నిర్ణాయక పోరులో పేసర్లు మెరుగైన ప్రదర్శన ఇస్తేనే భారత్‌కు విజయం సాధ్యం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!