

టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ప్రోటీస్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి 16 మ్యాచ్‌ల్లో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా నిలిచాడు. 2023లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన బవుమా.. ఇప్పటివరకు తన నాయకత్వంలో ఆడిన 16 టెస్టుల్లో 14 విజయాలు అందించాడు. ఒక మ్యాచ్‌లో ఓడిపోగా, మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో అతడి విజయాల శాతం 87.5గా నమోదైంది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లిండ్సే హస్సెట్ పేరిట ఉండేది. ఆయన తన తొలి 16 టెస్టుల్లో 13 విజయాలు సాధించాడు. బవుమా ఆ రికార్డును అధిగమించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చేసింది. తౌహిద్ హృదోయ్ 137, లిట్టన్ దాస్ 120 పరుగులతో శతకాలు సాధించారు. అనంతరం దక్షిణాఫ్రికా 557 పరుగులకు ఆలౌటై తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 168 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 12 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ప్రోటీస్ జట్టు ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తొలి 16 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో బవుమా 14 విజయాలతో అగ్రస్థానంలో నిలవగా.. లిండ్సే హస్సెట్ 13 విజయాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. బిల్ వుడ్‌ఫుల్, స్టీవ్ వా, రికీ పాంటింగ్ చెరో 11 విజయాలు సాధించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!