

టెస్టు సిరీస్ లో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ ఎదురైన తర్వాత, వన్డేల్లో అద్భుతంగా పుంజుకున్న టీమ్ ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు టీ20 సిరీస్ పై పూర్తి దృష్టి పెట్టింది. నాలుగో టీ20 మ్యాచ్ బుధవారం లక్నో లో జరగనుంది.
ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20 లో భారత బౌలర్లు చెలరేగి, దక్షిణాఫ్రికాను కేవలం 117 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ తర్వాత భారత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా విజయాన్ని అందుకుంది. లక్నో లో కూడా పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో భారత బౌలర్ల ప్రదర్శన పై ఆసక్తి నెలకొంది.
అయితే బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ల ఫామ్ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన సూర్య కేవలం 29 పరుగులే చేశాడు. గిల్ అతడి కంటే కేవలం మూడు పరుగులు మాత్రమే ఎక్కువగా సాధించాడు. మూడో టీ20 లో గిల్ క్రీజ్‌లో నిలిచినా, 28 బంతుల్లో 28 పరుగుల కే పరిమితమయ్యాడు. సూర్య బ్యాట్ నుంచి కూడా ఆశించిన మెరుపులు కనిపించలేదు.
ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ సారథి, ఉపసారథి ఇలాంటి ఫామ్‌లో ఉండటం జట్టు మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఈ కీలక మ్యాచ్‌లో అయినా ఇద్దరూ ఫామ్‌లోకి వస్తారా అన్నది చూడాలి.
అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మంచి ఫామ్‌లో ఉన్నారు. గాయంతో బాధపడుతున్న బుమ్రా ఈ మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. గత మ్యాచ్ జట్టునే కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేస్ బాధ్యతలను అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ నిర్వర్తించనుండగా, స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించనున్నారు.
ఇక సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న దక్షిణాఫ్రికా కూడా గట్టి పోరాటానికి సిద్ధమవుతోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!