

నూతన సంవత్సరంలో క్రికెట్ అభిమానులకు ముచ్చటైన ఆరంభాన్ని అందించేందుకు భారత క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో జరగనున్న సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ నెల 11న రాయ్‌పూర్‌లో జరిగే తొలి వన్డేతో కొత్త సంవత్సరంలో పురుషుల క్రికెట్ హడావుడి ప్రారంభం కానుంది.
ఈ సిరీస్‌కు సంబంధించి టీ20 ఫార్మాట్లో టీమ్ ఇండియాను ఇప్పటికే ప్రకటించారు. అయితే వన్డే మ్యాచ్‌లకు సంబంధించిన జట్టు ఎంపిక ఇంకా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ ఈ నెల 3 లేదా 4 తేదీల్లో ఆన్లైన్ సమావేశం నిర్వహించి వన్డే జట్టును ఖరారు చేయనున్నట్టు సమాచారం.
వన్డే జట్టులో వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు స్థానం దక్కుతుందా అనే అంశం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంత్ ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించడంతో ఆయన ఫామ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే గత 18 నెలలుగా ఒక్క వన్డే కూడా ఆడే అవకాశం ఇవ్వకుండా పంత్‌ను పక్కన పెట్టడం సరైనది కాదనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు, పంత్ ఆడే దూకుడు బ్యాటింగ్ శైలి టీమ్ మేనేజ్మెంట్లోని ఓ కీలక వ్యక్తికి అంతగా నచ్చడం లేదని సమాచారం. వన్డే ఫార్మాట్లో సంప్రదాయంగా నిలకడైన బ్యాటింగ్ చేయడమే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ అన్ని అంశాల మధ్య సెలెక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!