

టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ టీ20 జట్టులోకి చేరాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులో స్థానం పొందాడు. ఈ ఇద్దరూ రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించిన అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ స్క్వాడ్‌లో నిలిచారు.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో గాయపడిన గిల్, ఆ తర్వాత జరిగిన టెస్ట్, వన్డే సిరీస్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు మెడ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడు తిరిగి టీ20 వైస్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. అయితే తన ఫిట్నెస్ను మ్యాచ్‌ల ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
మరోవైపు హార్దిక్ పాండ్య ఇప్పటికే ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొని తన ఫిట్నెస్ను ప్రదర్శించాడు. గాయంతో 2025 ఆసియా కప్ ఫైనల్లో ఆడలేకపోయిన హార్దిక్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనను కూడా మిస్ అయ్యాడు. ఇప్పుడు అతడి రాకతో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ విభాగం మరింత బలపడనుంది.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బుధవారం ఈ జట్టును ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఈ నెల 9 న కటక్‌లో ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ 11 న చండీగఢ్‌లో, తరువాతి మ్యాచ్‌లు డిసెంబర్ 14 న ధర్మశాల, 17 న లక్నో, 19 న అహ్మదాబాద్‌లో జరుగనున్నాయి.
భారత టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!