

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అదరగొట్టింది. వడోదరలోని కోటాంబి స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆర్సీబీ నేరుగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ (55), మెగ్ లానింగ్ (41) రాణించినా, ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ 4 వికెట్లతో మెరిసింది. గ్రేస్ హారిస్ మరో 2 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేసింది.

144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. గ్రేస్ హారిస్ 36 బంతుల్లో 75 పరుగులతో మ్యాచ్‌ను ఏకపక్షం చేయగా, కెప్టెన్ స్మృతి మంధాన 31 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. కేవలం 13.1 ఓవర్లలోనే 147 పరుగులు చేసి ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో యూపీ వారియర్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీ ఆధిపత్య విజయాలు నమోదు చేయడం విశేషం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!