

టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆయన చివరిసారిగా అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్తో మార్చి 9, 2025 న ఆడాడు. అనంతరం ఫిట్నెస్ సమస్యల వల్ల జట్టుకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఏ టోర్నమెంట్లోనూ, ఏ ఫార్మాట్లోనూ సెలక్టర్లు ఆయనను ఎంపిక చేయలేదు. అయితే దేశవాళీ క్రికెట్లో మాత్రం రాణిస్తున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026 కు ముందు టీమిండియా న్యూజిలాండ్తో మూడు వన్డే సిరీస్ ఆడనుంది. ఇది జనవరి 11, 2026 నుంచి స్వదేశంలో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్కు షమీని సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటివరకు ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. బీసీసీఐ వర్గాలు చెబుతున్న మాటల్లో, "షమీ నైపుణ్యంపై ఎలాంటి అనుమానం లేదు. కానీ ఫిట్నెస్ గురించే ఆందోళన. న్యూజిలాండ్ వన్డే సిరీస్కు ఎంపికైతే ఆశ్చర్యం లేదు. 2027 వన్డే ప్రపంచకప్లో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి".
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో షమీ మూడు మ్యాచ్ల్లో 6 వికెట్లు, ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి రాణిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్న నేపథ్యంలో షమీ ఎంపిక అవకాశాలు మరింత పెరిగాయి. 2023 వన్డే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన షమీ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!