

తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్‌లో 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ నిర్వహించనున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికలుగా జరిగే ఈ పోటీల్లో 25 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 6 వేల మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఆతిథ్య రాష్ట్రంగా తెలంగాణ ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించడంతో పాటు మరో కొత్త క్రీడను కూడా చేర్చనుంది.
యూత్ గేమ్స్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీబీఎస్‌ఈ తదితర సంస్థల సమన్వయంతో పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణకు ఈ అవకాశం దక్కడంపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తోందని ఆయన అన్నారు.
తెలంగాణలో ఖేలో ఇండియా పథకం కింద ఇప్పటికే దాదాపు రూ.30 కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 33 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు సహాయం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పథకాల ద్వారా క్రీడాకారులకు శిక్షణ, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుభవం అందుతున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్ నిర్వహించనున్నారు. దేశంలోని 1,500కు పైగా కళాశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ క్రీడాకారులతో వర్చువల్‌గా మాట్లాడి క్రీడలు, ఫిట్‌నెస్, యువత భాగస్వామ్యంతో దేశ నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!