

2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్‌లో సంచలనం సృష్టించిన బాల్ టాంపరింగ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మాజీ ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా త్వరలో విడుదల చేయనున్న తన పుస్తకంలో ఈ ఉదంతానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఆస్ట్రేలియా జట్టులోని పలువురికి బాల్ టాంపరింగ్ గురించి తెలిసినా, అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్‌లను మాత్రమే బాధ్యులుగా నిలిపారని ఖవాజా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఖవాజా వాదనకు వార్నర్ మద్దతు తెలుపుతూ, క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణ తొందరపాటుతో, తప్పులతడకగా ముగిసిందని వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారంపై మాట్లాడి చాలా కాలమైందని, ఖవాజా చెప్పిన విషయాలకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపాడు.
అయితే, ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మాత్రం ఖవాజా వాదనను ఖండించాడు. 2021లో తాను వెల్లడించిన అభిప్రాయానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, మైదానంలో ఉన్న బౌలర్లకు బాల్ టాంపరింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశాడు. 2018లో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ సందర్భంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు బాన్‌క్రాఫ్ట్ సాండ్‌పేపర్‌ను ఉపయోగించి, దాన్ని జేబులో పెట్టుకోవడం కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై బాన్‌క్రాఫ్ట్‌కు తొమ్మిది నెలలు, స్మిత్, వార్నర్‌లకు ఏడాది చొప్పున క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. తాజాగా ఖవాజా పుస్తకంలోని వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఈ వివాదంపై మరోసారి చర్చ మొదలైంది.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!