

న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌ను గెలుచుకున్న భారత్.. వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకున్నప్పటికీ బ్యాటింగ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్ల నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. విరాట్ కోహ్లి నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి 86 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. తొలి వన్డేలో 74 పరుగులు చేసిన అతడు.. ఆ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 7, 0, 5 పరుగులే సాధించాడు. శుభ్‌మన్ గిల్ మూడు మ్యాచ్‌ల్లో 37 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 29 పరుగులకే పరిమితమయ్యాడు. ఇప్పుడు టెస్టు సిరీస్ రూపంలో భారత్‌కు మరో కఠిన పరీక్ష ఎదురుకానుంది. యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
న్యూజిలాండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో భారత బ్యాటర్లకు సవాల్ తప్పకపోవచ్చు. ఇటీవల జరిగిన వన్డేలో మ్యాట్ హెన్రీ ధాటికి భారత్ కేవలం 89 పరుగులకే కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది. హెన్రీతో పాటు డఫీ, జేమీసన్, టిక్నర్, నాథన్ స్మిత్‌లతో కూడిన కివీస్ పేస్ దళాన్ని ఎదుర్కోవడం టీమ్‌ఇండియాకు అంత సులభం కాకపోవచ్చు. న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు 25 టెస్టులు ఆడగా ఐదు విజయాలు, పది ఓటములు, పది డ్రాలు నమోదు చేసింది. అక్కడ ఆడిన 11 టెస్టు సిరీస్‌లలో భారత్ రెండింటిని మాత్రమే గెలుచుకుంది. 1968లో మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యంలో తొలిసారి సిరీస్ గెలిచిన భారత్.. ఆ తర్వాత 2009లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో మరోసారి విజయం సాధించింది. ఆ సిరీస్‌లో గౌతమ్ గంభీర్ రెండు సెంచరీలతో 445 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరిసారిగా 2020లో న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత్ 0-2తో సిరీస్‌ను కోల్పోయింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!