

ఫిఫా ప్రపంచకప్ 2026లో బెల్జియంతో 0-0తో డ్రా సాధించిన అనంతరం ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు తమ డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలి వెళ్లిన భావోద్వేగ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లాస్ ఏంజెలిస్‌లోని సోఫి స్టేడియంలో లభించిన ఈ చేతిరాత సందేశంలో అమెరికాలో జరిగిన మ్యాచ్‌ల సందర్భంగా తమకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము గర్వంగా వచ్చామని, గౌరవంతో పోటీపడ్డామని, అదే గౌరవంతో ఇక్కడి నుంచి వెళ్తున్నామని పేర్కొంటూ ప్రపంచ దేశాల మధ్య శాంతి, స్నేహం, పరస్పర గౌరవం నెలకొనాలని ఆకాంక్షించారు.
ఈ లేఖలో “#Minab” మరియు “#168” హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ప్రస్తావించారు. ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో జరిగిన విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల జ్ఞాపకార్థంగా వాటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రయాణ ఆంక్షల కారణంగా మెక్సికోలో బస చేస్తూనే ప్రపంచకప్‌లో పోటీపడుతున్న ఇరాన్ జట్టు, బెల్జియంతో డ్రా ద్వారా నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తదుపరి దశలో అమెరికాతో తలపడే అవకాశం ఉండటంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!