

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మార్చి 26, గురువారం ప్రారంభమై, మే 31, ఆదివారం ఫైనల్‌తో ముగియనుంది. అయితే బీసీసీఐ ఇంకా పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం, వేలానికి ముందు జరిగిన బ్రీఫింగ్ సందర్భంగా ఐపీఎల్ సీఈఓ హేమాంగ్ అమీన్ సీజన్ 19 తేదీలను ఫ్రాంచైజీ ప్రతినిధులకు ధృవీకరించారు.
భారత్, శ్రీలంకల వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన దాదాపు మూడు వారాల తర్వాత ఐపీఎల్ 2026 నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, ప్రారంభ మ్యాచ్ వేదికపై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతోంది. సాంప్రదాయంగా డిఫెండింగ్ ఛాంపియన్ల సొంత మైదానంలో తొలి మ్యాచ్ జరగాల్సి ఉన్నప్పటికీ, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం లభ్యతపై స్పష్టత లేదు. అబుదాబిలోని ఓ హోటల్లో జరిగిన ప్రీ-వేలం సమావేశంలో ఈ అంశం ఫ్రాంచైజీల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) షరతులతో కూడిన అనుమతిని పొందింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, తుది నిర్ణయానికి ముందు హోంమంత్రి జి. పరమేశ్వర కేఎస్‌సీఏ అధికారులతో సమావేశం నిర్వహిస్తారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల తెలిపారు. జూన్ 4 న ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి చెందడంతో చిన్నస్వామి స్టేడియం చుట్టూ అనిశ్చితి నెలకొంది. ఈ ఘటన అనంతరం స్టేడియంలో పెద్ద కార్యక్రమాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించడంతో, మహిళల ప్రపంచ కప్‌కు సంబంధించిన కొన్ని మ్యాచ్‌లను బెంగళూరు నుంచి తరలించాల్సి వచ్చింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!