

IPL 2026 వేలంలో యువ ఆటగాళ్ల కథలు అభిమానులను భావోద్వేగానికి గురిచేశాయి. రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌కు చెందిన కార్తీక్ శర్మ క్రికెటర్ కావాలన్న తండ్రి కలను నిజం చేశాడు. భుజం గాయం కారణంగా తన కెరీర్ ఆగిపోయినా, తండ్రి మనోజ్ శర్మ తనయుడి కోసం భూమి, భార్య నగలు అమ్మి శిక్షణ ఇప్పించాడు. దీపక్ చాహర్ తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ వద్ద శిక్షణతో కార్తీక్ ఆట మరింత మెరుగైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 160కు పైగా స్ట్రైక్ రేట్‌తో రాణించిన అతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది.
మధ్యప్రదేశ్ చింద్వారా నుంచి వచ్చిన మంగేశ్ జీవితం కూడా పోరాటమే. ట్రక్ డ్రైవర్ తండ్రికి సంతోషం ఇవ్వాలన్న లక్ష్యంతో 70 కిలోమీటర్లు ప్రయాణించి అకాడమీలో సాధన చేశాడు. ఫాస్ట్ బౌలర్‌గా పేరు తెచ్చుకుని, మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. మైదాన సిబ్బందికి తన ప్రైజ్‌మనీ, సైకిల్ దానం చేసిన అతడి మనసు అందరినీ ఆకట్టుకుంది. ఈ మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంగేశ్‌ను రూ.5.2 కోట్లకు సొంతం చేసుకుంది.
క్రికెట్‌కు అనుకూలం కాని బారాముల్లా నుంచి ఎదిగిన ఆకిబ్ నబి కథ మరింత ప్రత్యేకం. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి డాక్టర్ కావాలనుకున్నా, ఆకిబ్ క్రికెట్ వైపు అడుగులు వేశాడు. బెంగళూరులో సాధన చేస్తూ పేస్ బౌలర్‌గా మెరుగయ్యాడు. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించి ‘బారాముల్లా డేల్ స్టెయిన్’గా పేరొందాడు. ఐపీఎల్ వేలంలో దిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.8.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ డబ్బుతో తన స్వస్థలంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయాలన్నదే ఆకిబ్ కల.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!