

ఐపీఎల్-2026 సీజన్ ముగిసిన అనంతరం భారత అండర్-19, అండర్-25 జట్లు రెడ్ బాల్ సిరీస్‌ల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లలో రెడ్ బాల్ నైపుణ్యాలను మెరుగుపరచేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. అండర్-25 క్యాంప్ కోసం మొత్తం 25 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేయగా, ఇందులో యువ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, అయూష్ మాత్రేకు చోటు దక్కలేదు. వీరు ఐపీఎల్-2026లో బిజీగా ఉండటంతో బీసీసీఐ ఈసారి వారిని పరిగణలోకి తీసుకోలేదు. అయితే భవిష్యత్తులో ప్రధాన జట్టులో అవకాశం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
శ్రీలంక టూర్‌కు ముందు బీసీసీఐ ఇంట్రా-సీఓఈ టోర్నమెంట్‌ను కూడా నిర్వహించనుంది. ఈ టోర్నమెంట్లో నాలుగు రోజుల రెడ్-బాల్ మ్యాచ్‌ల సిరీస్ జరగనుండగా, దేశవ్యాప్తంగా 64 మంది యువ క్రికెటర్లు పాల్గొంటారు. వీరిని నాలుగు జట్లుగా విభజిస్తారు, ప్రతి జట్టులో 16 మంది ఆటగాళ్లు ఉంటారు. సీకే నాయుడు ట్రోఫీ, అండర్-23 వన్డే టోర్నీల్లో ప్రతిభ చూపిన 25 మంది, అలాగే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో రాణించిన 25 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. మిగిలిన 14 మందిలో అండర్-19 వరల్డ్‌కప్, ఐపీఎల్ స్టార్లు ఉన్నారు. ఈ క్యాంప్‌లో రాణించిన ఆటగాళ్లకు ‘ఇండియా ఎమర్జింగ్’ (అండర్-25) ప్రధాన జట్టులో చోటు దక్కనుంది. ఈ జట్టు శ్రీలంకలో పర్యటించి రెడ్-బాల్ మ్యాచ్‌లు ఆడనుంది. మొత్తం ఈ కార్యక్రమం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!