

సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు ఆతిథ్యమిస్తోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ మెగా టోర్నీలో ప్రపంచంలోని అగ్రశ్రేణి షట్లర్లు బరిలోకి దిగనున్నారు. సొంతగడ్డపై భారత క్రీడాకారులు సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు.
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుపై ప్రత్యేక అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో ఐదు పతకాలు సాధించిన సింధు.. మరో పతకంతో తన ఖాతాను మరింత పెంచుకోవాలని చూస్తోంది. సెమీఫైనల్‌కు చేరితే కనీసం కాంస్యం ఖాయం కావడంతో ఆరు ప్రపంచ పతకాలతో అరుదైన ఘనత సాధించే అవకాశం ఉంటుంది.
సింధుకు డ్రా కూడా అనుకూలంగా ఉంది. తొలి రౌండ్‌లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబుల్‌తో తలపడనుంది. ప్రీక్వార్టర్స్‌లో మూడో సీడ్ వాంగ్ జీ యీతో పోటీ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇండోనేసియాకు చెందిన పుత్రి కుసుమ వర్దనితో క్వార్టర్‌ఫైనల్ పోరు ఉండొచ్చు. అన్ని అడ్డంకులను అధిగమిస్తే ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ అన్ సె యంగ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. డిఫెండింగ్ చాంపియన్ అకానే యమగూచి, చెన్ యుఫీ కూడా టైటిల్ రేసులో గట్టి పోటీదారులుగా ఉన్నారు.
మరోవైపు భారత యువ షట్లర్ ఉన్నతి హుడా తొలి రౌండ్‌లో మయన్మార్‌కు చెందిన తెట్ హ్టార్ తుజార్‌తో తలపడనుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీపై కూడా భారీ అంచనాలున్నాయి. స్వదేశంలో జరిగే ఈ టోర్నీలో భారత షట్లర్లు పతకాల పంట పండించాలని అభిమానులు కోరుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!