

రాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనాలా? వద్దా? అన్న అంశంపై బంగ్లదేశ్ క్రికెట్ బోర్డు 24 గంటల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ స్పష్టం చేసింది. బుధవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, బంగ్లాదేశ్ జట్టు గ్రూప్-సి మ్యాచ్లు భారత్లోనే జరుగుతాయని, వాటిని శ్రీలంకకు మార్చే అవకాశం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. భారత్లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా సమస్యలు లేవని స్పష్టం చేస్తూ, షెడ్యూల్ ప్రకారం అక్కడే మ్యాచ్లు ఆడాల్సి ఉంటుందని తెలిపింది.
గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్ క్రికెట్ అనిశ్చితి పరిస్థితుల్లో కొనసాగుతోంది. పొరుగుదేశాలతో ఏర్పడిన సరిహద్దు వివాదాల నేపథ్యంలో, టోర్నీలో పాల్గొనడానికి బీసీబీ కొన్ని షరతులు విధించగా, ఇప్పుడు ఆ నిర్ణయాలే బోర్డును ఇబ్బందుల్లోకి నెట్టిన పరిస్థితి ఏర్పడింది.
ఐసీసీ కఠిన వైఖరి నేపథ్యంలో బీసీబీకి ఎంపికలు చాలా పరిమితంగా మారాయి. నిర్ణయం తీసుకోకపోతే ప్రత్యామ్నాయ జట్లను పరిశీలించడం లేదా బంగ్లాదేశ్ మ్యాచ్లను ఫోర్ఫీట్గా పరిగణించే అవకాశం కూడా ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మరియు దేశంలోని తాత్కాలిక ప్రభుత్వ మధ్య సమన్వయం లోపించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఆటగాళ్లకు కూడా పరిణామాల పై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ అనిశ్చితి వల్ల ప్రకటన ఒప్పందాలు, వాణిజ్య లాభాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది.
ఈ రోజు చివరికి బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే పరిస్థితుల్ని గమనిస్తే ఆశావహ వాతావరణం మాత్రం కనిపించడం లేదు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!