

భారత యువ గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేశ్ నార్వే చెస్ టోర్నమెంట్ 2026లో నిరాశాజనక ప్రదర్శన చేశారు. ఆరుగురు ఆటగాళ్ల మధ్య జరిగిన పోటీలో కేవలం ఒక క్లాసికల్ గేమ్ మాత్రమే గెలిచి అట్టడుగు స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్‌గా మారిన తర్వాత వచ్చే మానసిక ఒత్తిడి గురించి గుకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ టైటిల్ గెలవకపోవడమే కొన్నిసార్లు మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. “బయటి ప్రపంచాన్ని దూరంగా ఉంచాలని ప్రయత్నించినా అంచనాలు, లక్ష్యాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. నేను ఎప్పుడూ గెలుపు కోసం ప్రయత్నించే ఆటగాడిని. అందుకే ఈ దశ కాస్త కఠినంగా అనిపిస్తోంది” అని తెలిపారు.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు మెంటల్ కండిషనింగ్ కోచ్ ప్యాడీ అప్టన్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గుకేశ్ వెల్లడించారు. ప్రస్తుతం తన అత్యుత్తమ స్థితిలో లేనప్పటికీ, ప్రతి రోజు చెస్‌లో కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నానని చెప్పారు. ఫలితాలు నిరాశపరిచినా, చెస్‌పై ప్రేమ తగ్గలేదని స్పష్టం చేశారు. అదే తనను ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో ఉజ్బెకిస్థాన్ గ్రాండ్‌మాస్టర్ నోదిర్బెక్ సిందరోవ్‌తో టైటిల్ రక్షణ పోరుకు సిద్ధమవుతూ, అంచనాలను నిలబెట్టుకోవడమే తనకు పెద్ద సవాలుగా ఉందని చెప్పారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!