

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో తెలంగాణను దేశంలోనే ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఈ-సిటీలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన మివీ నూతన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆయన ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన మివీ సంస్థ ఇప్పటికే ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, సౌండ్‌బార్లు వంటి ఆడియో ఉత్పత్తులను తయారు చేస్తోంది. తాజాగా వన్ 5జీ స్మార్ట్‌ఫోన్‌తో మొబైల్ తయారీ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకునేలా టెక్నాలజీ, ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలను అనుసంధానిస్తూ సమగ్ర పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు. మివీ నూతన కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2,500 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. మరోవైపు, పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా పారిశ్రామికవేత్తలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!