

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ కు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ కు కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న మొయీన్ అలీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే స్టార్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ కూడా ఐపీఎల్ కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మొయిన్ అలీ కూడా అదే మార్గాన్ని ఎంచుకోవడం కేకేఆర్ కు పెద్ద షాక్‌గా మారింది.
ఇటీవల జరిగిన రిటెన్షన్ ప్రక్రియలో కేకేఆర్ రస్సెల్‌తో పాటు మొయీన్ అలీ ని కూడా జట్టులో కొనసాగించలేదు. తమను వదిలేయడం పై మొయీన్ అలీ తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. గత సీజన్ ఐపీఎల్ 2025 లో అతను కేవలం ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదు పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కేకేఆర్ అతన్ని రిటైన్ చేయకుండా నిర్ణయం తీసుకుంది. 2022 లో జరిగిన మెగా వేలంలో కేకేఆర్ అతన్ని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
కేకేఆర్ నుంచి విడుదల కావడంతో మొయీన్ అలీ తదుపరి వేలంలో తన పేరు నమోదు చేయకుండానే ఐపీఎల్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పేశాడు. అతను పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడాలని నిర్ణయించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించాడు. పీఎస్ఎల్ 2026 లో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశాడు. 2020 లో చివరిసారి ముల్తాన్ సుల్తాన్స్ తరఫున పీఎస్ఎల్లో ఆడిన తర్వాత ఇప్పుడు ఐదేళ్లకు మళ్లీ ఆ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు.
ఇక కేకేఆర్ ఈసారి భారీ మార్పులకు సిద్ధమైంది. మొయీన్ అలీ, రస్సెల్ తో పాటు పలు కీలక ఆటగాళ్లను విడుదల చేసింది. గత సీజన్ వేలంలో రూ. 23.75 కోట్ల రికార్డు ధరకు అమ్ముడైన వెంకటేష్ అయ్యర్ ను కూడా జట్టు వదిలేసింది. అదనంగా టి20 స్పెషలిస్ట్ క్వింటన్ డికాక్, స్పెన్సర్ జాన్సన్, నోర్జే, రహ్మానుల్లా గుర్బాజ్‌లను కూడా వేలంకు పంపింది. రాబోయే సీజన్‌కు కొత్త వ్యూహంతో జట్టును పూర్తిగా పునర్నిర్మించాలనే చర్యగా ఈ నిర్ణయాన్ని పరిగణిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!