

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ మరోసారి గాయం కారణంగా సెలక్షన్ రేస్ లో వెనుకబడే పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే నెల న్యూజిల్యాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతను అందుబాటులో ఉండడం కష్టమేనని సమాచారం.
కొంతకాలంగా గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న అయ్యర్ సుమారు ఆరు కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తిగా కోలుకోని స్థితిలో అతనితో అంతర్జాతీయ క్రికెట్ ఆడించడం సబబు కాదని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాటింగ్ చేయగలిగినా, ఫీల్డింగ్‌లో పూర్తి స్థాయి ఫిట్నెస్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
అన్ని అనుకూలంగా జరిగితే, శ్రేయాస్ ముందుగా విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్‌లు ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకోవాలని ప్రణాళిక రూపొందించారు. జనవరి 3, 6 తేదీల్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ మంచి ప్రదర్శన కనబరిస్తే, న్యూజిల్యాండ్ వన్డే సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసే అవకాశముందని గతంలో ప్రచారం జరిగింది.
అయితే తాజా సమాచారం ప్రకారం, అయ్యర్ ప్రస్తుతం స్కిల్ ట్రైనింగ్ ప్రారంభించాడు. అయినప్పటికీ, 50 ఓవర్లు పూర్తిగా ఫీల్డింగ్ చేసే స్థాయిలో అతని శారీరక సామర్థ్యం ఉందా లేదా అన్నది ముఖ్య అంశంగా మారింది. వైద్యుల సూచనల ఆధారంగానే అతను విజయ్ హజారే ట్రోఫీ ఆడాలా, ఆ తర్వాత న్యూజిల్యాండ్ వన్డేలకు ఎంపిక కావాలా అనే నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!