

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై భారత జట్టు మేనేజ్మెంట్ను మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు. సిరాజ్‌ను పక్కన పెట్టాలనే నిర్ణయం అప్పటికప్పుడు తీసుకున్నది కాదని, నెల రోజుల ముందే దీనికి సంబంధించిన ప్రణాళిక మొదలై ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. వన్డేల్లోనూ సిరాజ్‌కు అవకాశాలు ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మరో ఏడాదిలోపు వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో, గత ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన సిరాజ్ జట్టుకు అవసరం లేదా? అని ప్రశ్నించాడు. ప్రస్తుత పరిణామాలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు మరిన్ని పరిణామాలు ఉండొచ్చని వ్యాఖ్యానించాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సిరాజ్ 43 వికెట్లు పడగొట్టిన విషయాన్ని అశ్విన్ గుర్తుచేశాడు. ఇంతటి ప్రదర్శన చేసిన బౌలర్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. భారత పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రాతోపాటు సిరాజ్ పేరును ముందుగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. మిగిలిన స్థానాల కోసం ఇతర పేసర్లను పరిశీలించవచ్చని అభిప్రాయపడ్డాడు. సిరాజ్‌కు జట్టులో చోటు విషయంలో పోటీ ఎవరి నుంచి ఉందో తనకు అర్థం కావడం లేదని అశ్విన్ పేర్కొన్నాడు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!