

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ మోదక్ తనదైన మాటతీరు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, ప్రత్యేకమైన స్పందనలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హౌస్‌లో అందరితో కలిసిపోయే విధానం, తోటి కంటెస్టెంట్లతో మాట్లాడే తీరు ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నాయి. బెంగాలీ కుటుంబంలో జన్మించిన దేబ్జానీ.. వ్యాపారవేత్త అపూర్బా మోదక్, గృహిణి మితా మోదక్ దంపతుల కుమార్తె. ఆమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది. చిన్నతనంలో నటనపై పెద్దగా ఆసక్తి లేకపోయినా.. అనుకోకుండా ఓ సీరియల్‌లో అవకాశం రావడంతో బుల్లితెరపైకి అడుగుపెట్టింది. అలా బెంగాలీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.
తెలుగులో ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్ దేబ్జానీకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సీరియల్‌లో తన నటన, మాటతీరుతో ఆమె బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే గుర్తింపుతో బిగ్‌బాస్ తెలుగు 10లోకి అడుగుపెట్టిన ఆమె.. మొదటి నుంచే తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా.. హౌస్‌లోని ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని దేబ్జానీ చెప్పడం ఆసక్తిని రేకెత్తించింది. ముకేశ్ అందరితో సరదాగా మాట్లాడతాడని, కానీ తన దగ్గరకు మాత్రం పెద్దగా రావడం లేదని ఆమె చెప్పింది. కాఫీ అంటే తనకు ఎంత ఇష్టమో.. ముకేశ్ అంటే కూడా అంతే ఇష్టమని, అతడి కళ్లు తనకు చాలా నచ్చుతాయని వెల్లడించింది. దీంతో ఆమె నిజంగానే ముకేశ్‌ను ఇష్టపడుతోందా? లేక గేమ్‌లో భాగంగానే ఇలా చెబుతోందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు తాను ఆరో తరగతిలో ఫెయిల్ కావడంతో ఆ తరగతిని రెండుసార్లు చదవాల్సి వచ్చిందని కూడా దేబ్జానీ తెలిపింది. మొత్తంగా బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె ప్రయాణం ఎంతవరకు సాగుతుంది? టైటిల్ పోరులో నిలిచి కప్ సాధిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!