

అర్నబ్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. తుఫాన్ బాధితులకు సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసింది. విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి అందజేసింది.
తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలకు అండగా నిలిచేందుకు ఉదారంగా విరాళం అందించిన ఎస్‌బీఐ యాజమాన్యానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొచ్చిన బ్యాంకు ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల్ కుమార్, జనరల్ మేనేజర్ కుందన్ జ్యోతి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ షమీన్ భాను తదితరులు పాల్గొన్నారు.







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!