

అనంతపురం జిల్లా రాప్తాడులోని ఓ హైస్కూల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రెండో పీరియడ్ తరగతి జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి రంపంతో పాఠశాలలోకి ప్రవేశించి పదో తరగతి విద్యార్థినిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు భయాందోళనకు గురై తరగతి గది నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దాడిలో బాలిక కుడిచేయి తీవ్రంగా దెబ్బతినడంతో పాటు ముఖంపై గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు రంపంతో పాఠశాలలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై బాలిక బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమార్తె ఎవరైనా వేధిస్తున్నట్లు గతంలో చెప్పలేదని బాలిక మేనత్త తెలిపింది. నిందితుడు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.
మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. దాడికి పాల్పడిన వ్యక్తిని హేమంత్‌గా గుర్తించి, ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు బాధిత బాలికకు మేనమామ అవుతాడని అనుమానిస్తున్నారు. బాలిక ప్రేమను నిరాకరించడంతోనే అతడు దాడికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెలువడుతోంది. అయితే ఈ కారణంపై పోలీసుల అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఘటన జరిగిన సమయంలో ఎన్నికల విధుల కారణంగా పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని క్లాస్ టీచర్ తెలిపినట్లు సమాచారం. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి ఉద్దేశం, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!