

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పదకొండో వారానికి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన రోహిత్ నాయుడు మరోసారి హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడితో పాటు గతంలో ఎలిమినేట్ అయిన షాలినీ, అపూర్వ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ ముగ్గురూ వారం రోజుల పాటు గెస్ట్ కంటెస్టెంట్లుగా హౌస్‌లో ఉండనున్నారని తెలుస్తోంది. దీపావళి వారంలోనే వీరి రీఎంట్రీకి ప్రణాళిక రూపొందించినప్పటికీ, కొన్ని కారణాలతో వాయిదా పడినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు పదకొండో వారంలో వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారం రోజుల తర్వాత ప్రేక్షకుల ఓటింగ్ నిర్వహించి, ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే హౌస్‌లో శాశ్వతంగా కొనసాగేందుకు అవకాశం కల్పించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మరోవైపు పదకొండో వారం నామినేషన్ల ప్రక్రియలోనూ కొత్త ప్రయోగం చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు తిరిగి హౌస్‌లోకి వచ్చి ప్రస్తుతం ఉన్న సభ్యులను నామినేట్ చేయనున్నారని సమాచారం. రోహిత్, షాలినీ రీఎంట్రీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. వీరిద్దరూ ప్రేక్షకుల ఓట్ల ద్వారా నేరుగా ఎలిమినేట్ కాలేదు. షాలినీ తొలుత సీక్రెట్ రూమ్‌కు వెళ్లి, అనంతరం హౌస్ సభ్యుల ఓట్లతో బయటకు వచ్చింది. రోహిత్ కూడా రెడ్ జోన్‌లో ఉండగా, ఇంటి సభ్యుల మెజారిటీ ఓట్లతో ఎలిమినేట్ అయ్యాడు. అతడి ఎలిమినేషన్‌పై అభిమానులు అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోహిత్ రీఎంట్రీ వార్తలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నవంబర్ 15 లేదా 16 తేదీల్లో ప్రసారమయ్యే ఎపిసోడ్లతో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!