
.jpeg&w=3840&q=75)
విడుదల తేదీ : డిసెంబర్ 19, 2025
నటీనటులు : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు
దర్శకుడు : మురళీ మనోహర్
నిర్మాణం : వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ)
సంగీత దర్శకుడు : కృష్ణ సౌరభ్ సూరంపల్లి
సినిమాటోగ్రాఫర్ : అర్జున్ రాజా
ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్
ఈ వారం థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో అవతార్ 3 వంటి భారీ చిత్రం తప్ప మిగతా ఇండస్ట్రీల నుంచి పెద్దగా పోటీ కనిపించలేదు. అలాంటి సమయంలో తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య నటించిన క్రైమ్ కామెడీ చిత్రం “గుర్రం పాపిరెడ్డి” విడుదలైంది.
గుర్రం పాపిరెడ్డి పాత్రలో నరేష్ అగస్త్య, సౌదామిని పాత్రలో ఫరియా అబ్దుల్లా నటిస్తూ, గొయ్యి (జీవన్), చిలిపి (వంశీధర్ గౌడ్), మిలట్రీ (రాజ్ కుమార్ కసిరెడ్డి)లతో కలిసి ఓ ప్లాన్ రూపొందిస్తారు. శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి, శ్రీనగర్ కాలనీలోని స్మశాన వాటికలో మరో శవంతో మార్పిడి చేయాలనేదే వారి లక్ష్యం. అయితే ఆ శవం అసలు ఎవరిది? దాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అన్న ప్రశ్నలతో కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.
ఈ క్రమంలో రాజ కుటుంబీకులైన హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర)లు గుర్రం పాపిరెడ్డిని టార్గెట్ చేసి అతని కోసం వెతకడం మొదలుపెడతారు. అసలు గుర్రం పాపిరెడ్డి ఎవరు? అతడు వీరికి ఏం చేశాడు? వారి ఆస్తిని ఎందుకు కాజేయాలని చూస్తున్నాడు? చివరకు ఈ సంఘటనల్లో ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం కలిగింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
బలమైన అంశాలు
ఈ సినిమాలో ప్రేక్షకులను కొంతమేర ఆకట్టుకునే అంశాలు ఉంటే అవి ప్రధానంగా అక్కడక్కడా వచ్చే నవ్వు పుట్టించే కామెడీ సన్నివేశాలే. దర్శకుడు ప్రతి పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసి, వాటి చుట్టూ రూపొందించిన కామెడీ ట్రాక్స్ మంచి వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో సినిమా మొదటి అరగంట పాటు కథనం సాఫీగా సాగుతూ, సాలిడ్ ఫన్‌తో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది.
ఈ కామెడీ ట్రాక్స్‌లో జీవన్ నటించిన గొయ్యి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్రలోని అమాయకత్వాన్ని తన పెర్ఫార్మెన్స్తో బాగా పండించాడు. అతనితో పాటు మిలట్రీ పాత్రలో రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా మంచి హాస్యాన్ని పండించారు. స్మశాన వాటికలో వచ్చే ట్రాక్, అలాగే క్లైమాక్స్‌లో యోగిబాబుతో ఉన్న ఫన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. హీరో నరేష్ అగస్త్య తన పాత్రలో మంచి టైమింగ్‌తో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, ఫరియా అబ్దుల్లా గ్లామర్‌తో పాటు నటనలోనూ మెప్పించారు. లీడ్ నటులు ప్రోస్థెటిక్ మేకప్‌లో చేసిన సన్నివేశాలు వారి అంకితభావాన్ని చూపిస్తాయి. మొత్తంగా, ఈ సినిమా కామెడీ సన్నివేశాల వరకు వినోదంలో లోటు లేకుండా సాగుతుంది, మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా సరైన స్థాయిలో పనిచేస్తాయి.
లోపాలు
డీసెంట్ ఫన్, కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ ఈ సినిమా కథనం మాత్రం అవసరానికి మించి సాగదీతగా ఉండి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రారంభ అరగంట నుంచి నలభై నిమిషాలు వరకూ కామెడీ ట్రాక్స్‌తో సాఫీగా సాగిన సినిమా, మెయిన్ ప్లాట్‌లోకి వెళ్లిన తర్వాత బలహీనంగా అనిపిస్తుంది. రొటీన్ కథనం, ఇటీవల వచ్చిన ఫన్ క్రైమ్ థ్రిల్లర్స్‌ను తలపించే నడక కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. కథ ఫ్లోను అడ్డుకునే పాటలు, టైట్ కాకపోయిన ఎడిటింగ్, రియాలిటీకి దూరంగా సిల్లీగా అనిపించే ప్లాన్లు మైనస్లుగా మారాయి. యోగిబాబు, బ్రహ్మానందం వంటి కామెడీ ఆర్టిస్టులను పూర్తిగా ఉపయోగించుకోకపోవడం కూడా లోపమే. మొత్తంగా, ఆకట్టుకునే అంశాలు ఉన్నప్పటికీ వాటికంటే బోర్ పుట్టించే అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి.
సాంకేతిక విశ్లేషణ
ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉండటంతో మేకర్స్ పెట్టిన ఖర్చు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ బాగుండగా, కృష్ణ సౌరభ్ సంగీతం ఆకట్టుకుంటుంది, అర్జున్ రాజా కెమెరా వర్క్ కూడా ప్లస్ పాయింట్. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ పరంగా కొంతవరకు సరిపోయినా, ల్యాగ్ సీన్స్ మరియు పాటలు ఇంకా కట్ చేసి ఉంటే బాగుండేది. నిరంజన్ రామిరెడ్డి డైలాగ్స్ ముఖ్యంగా కామెడీ రైటింగ్‌లో మెప్పిస్తాయి. దర్శకుడు మురళీ మనోహర్ కామెడీ ట్రాక్స్ వరకు బాగా హ్యాండిల్ చేసినప్పటికీ, మెయిన్ కథలో డెప్త్, ఎమోషన్స్ లోపించాయి. కథనాన్ని ఎక్కువగా డ్రాగ్ చేయడం వల్ల ప్రభావం తగ్గింది; సీన్స్‌ను కుదించి ఉంటే ఈ క్రైమ్ కామెడీ మరింత ఇంపాక్ట్ చూపించేదని చెప్పొచ్చు.
తుది మాట
మొత్తంగా చూస్తే 'గుర్రం పాపిరెడ్డి’ లో ప్రధాన నటీనటులంతా మంచి పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు, అలాగే అక్కడక్కడా వచ్చే కామెడీ ట్రాక్స్ బాగా నవ్వు తెప్పిస్తాయి. అయితే ఆ ఫన్‌కు తగ్గట్టుగా కథనం మరింత గ్రిప్పింగ్‌గా ఉండి ఉంటే సినిమా ప్రభావం పెరిగేదని అనిపిస్తుంది. ల్యాగ్ ఉన్నా సరే కొద్దిసేపు నవ్వుకోవడం కోసమే చూస్తామనుకునే వారు తక్కువ అంచనాలతో ఈ సినిమాను ట్రై చేయవచ్చు











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!