

విడుదల తేదీ: నవంబర్ 27, 2026
నటీనటులు: రజత్ రాఘవ్, కాజల్ చౌదరి, బేబీ పరిణిత రుద్రరాజు, హాసిని సుధీర్, జెమిని సురేష్, గుండు సుదర్శన్ తదితరులు.
దర్శకుడు: శరత్
నిర్మాతలు: డి. దీపక్
సంగీత దర్శకుడు: ఆర్.హెచ్. విక్రమ్
సినిమాటోగ్రాఫర్: కుశ్వంత్ కుమార్
ఎడిటర్: సూర్య పొన్నపల్లి
కొన్ని కారణాల వల్ల ఆకాంక్ష (కాజల్ చౌదరి) తన భర్త నుంచి విడిపోయి కూతురు పరిణిత (బేబీ పరిణిత)తో కలిసి జీవిస్తుంటుంది. అనుకోని ఓ ఘటన కారణంగా రాహుల్ (రజత్ రాఘవ్) పరిణితతో కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. మొదట వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ తరహాలో చిన్నచిన్న గొడవలు, సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. అసలు రాహుల్‌కు ఆకాంక్షకు ఉన్న సంబంధం ఏమిటి? పరిణితకు అతను ఎందుకు దగ్గరవ్వాలని చూస్తాడు? ఆమె మనసు గెలుచుకోవడానికి రాహుల్ ఏం చేశాడు? చివరికి వీరి బంధం ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే సినిమా కథ.
ఈ సినిమాకు ప్రధాన బలం తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు. ముఖ్యంగా తండ్రి పాత్రలో రజత్ రాఘవ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. కూతురి ప్రేమ కోసం తపించే తండ్రిగా తన పాత్రకు న్యాయం చేశాడు. బేబీ పరిణిత తన వయసుకు మించిన నటనతో పాటు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. రజత్ రాఘవ్, పరిణిత మధ్య వచ్చే సరదా సన్నివేశాలు, క్లైమాక్స్ ఎపిసోడ్ కుటుంబ ప్రేక్షకులను కదిలిస్తాయి. కాజల్ చౌదరి కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించింది.
కథాంశం రొటీన్‌గా అనిపించినప్పటికీ, దర్శకుడు తాను చెప్పాలనుకున్న ప్రధాన అంశంపై దృష్టి పెట్టడం బాగుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.
మంచి భావోద్వేగ అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, ఆసక్తికరమైన కథనంతో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు శరత్ తడబడ్డాడు. సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తర్వాత ఏం జరగబోతుందో ప్రేక్షకులకు అర్థమైపోతుంది. ఊహించదగిన సన్నివేశాలు, పాత తరహా మేకింగ్ సినిమాపై ఆసక్తిని తగ్గిస్తాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా సాగుతూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో మరింత బలమైన డ్రామా, హాస్యం ఉంటే బాగుండేది.
జెమిని సురేష్, గుండు సుదర్శన్ వంటి నటులు ఉన్నప్పటికీ వారి పాత్రలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదు. సెకండాఫ్‌లోనూ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. దీంతో సినిమా వేగం తగ్గుతుంది.
దర్శకుడు శరత్ మంచి భావోద్వేగ అంశాన్ని ఎంచుకున్నప్పటికీ, దాన్ని తెరపై అంతే బలంగా ఆవిష్కరించడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోయాడు. ఆర్.హెచ్. విక్రమ్ అందించిన నేపథ్య సంగీతం ఎమోషనల్ సన్నివేశాలకు పర్వాలేదనిపిస్తుంది. అయితే పాటలు పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. కుశ్వంత్ కుమార్ సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని నిడివి తగ్గించి ఉంటే సినిమా వేగంగా సాగేది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
మొత్తంగా ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ కొంతవరకే ఆకట్టుకునే రొటీన్ ఫ్యామిలీ డ్రామా. రజత్ రాఘవ్, బేబీ పరిణిత నటనతో పాటు అక్కడక్కడా పండిన తండ్రీకూతుళ్ల భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. అయితే నెమ్మదిగా సాగే కథనం, ఊహించదగిన సన్నివేశాలు ప్రతికూలంగా మారాయి. ఫ్యామిలీ డ్రామాలను ఇష్టపడేవారు తక్కువ అంచనాలతో చూడొచ్చు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!