

పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర బెంగాల్లో నిర్వహించిన అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు హాజరయ్యే సందర్భంలో జరిగిన పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సదస్సు వేదికను మార్చడం, అలాగే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కార్యక్రమానికి హాజరుకాకపోవడం సరైనది కాదని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, దేశంలోని గిరిజన సమాజాన్ని బాధపెట్టే విషయం అని మోదీ పేర్కొన్నారు.
ఈ ఘటనపై మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందిస్తూ, ఇది సిగ్గుచేటైన విషయం అని అన్నారు. టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులు దాటిందని, రాష్ట్రపతికి జరిగిన అవమానానికి ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన బాధపెడుతుందని ఆయన అన్నారు.
ఇక మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ విషయంపై స్పందించారు. సిలిగురిలో జరిగే సదస్సుకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు లేదా ఉన్నతాధికారులు స్వాగతం పలకాల్సి ఉన్నప్పటికీ ఎవరూ రాలేదని తెలిపారు. ముందుగా నిర్ణయించిన వేదికకు భద్రతా కారణాల వల్ల అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అయితే తనకు బెంగాల్ ప్రభుత్వంపై ఎలాంటి ద్వేషం లేదని, మమతా బెనర్జీ తనకు సోదరితో సమానమని రాష్ట్రపతి పేర్కొన్నారు. తాను కూడా బెంగాల్ కూతురేనని ఆమె గుర్తు చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!