

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థుల జాబితాల ప్రకటనలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈసారి అత్యంత ప్రతిష్ఠాత్మక అసెంబ్లీ స్థానంగా భవానీపుర్ నిలువనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి బరిలోకి దిగడమే దీనికి కారణం. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో సీఎంను ఓడించిన సువేందును మళ్లీ దీదీ పై పోటీకి దించడంలో భాజపా వ్యూహమేంటనేది ఆసక్తిగా మారింది.
భవానీపుర్ నియోజకవర్గం కోల్‌కతా దక్షిణ్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. మమతా బెనర్జీ నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. కొంతకాలంగా ఇక్కడ టీఎంసీ బలహీనపడిందని భాజపా భావిస్తోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థికి 28వేల మెజారిటీ రాగా లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీఎంసీ-భాజపాల మధ్య 8వేల ఓట్ల తేడానే కనిపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చాలా వార్డుల్లో భాజపా పట్టు సాధించినట్లు అంచనా. వీటికితోడు ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి గణనీయంగా ఓట్లను తొలగించారనే వాదన ఉంది. దాదాపు 47 వేల ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇది గత ఎన్నికల్లో దీదీకి వచ్చిన మెజారిటీ కన్నా 11వేలు మాత్రమే తక్కువ.
మమతా బెనర్జీకి గతంలో విశ్వాసపాత్రుడిగా ఉన్న సువేందు అధికారి.. భాజపాలో చేరిన తర్వాత ప్రధాన ప్రత్యర్థిగా మారారు. నందిగ్రామ్ నుంచి రెండుసార్లు విజయం సాధించిన ఆయన.. ముఖ్యమంత్రినే ఓడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోన్న భాజపా.. తృణమూల్ సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకోవాలని చూస్తోంది. గతంలో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని వ్యక్తిగతంగా ఓడించి కొంతమేర సఫలమైంది. తాజాగా మరోసారి ఆమెకు తోడుగా నిలుస్తోన్న భవానీపుర్‌లో సువేందు అధికారిని బరిలో నిలిపి సవాల్ విసురుతోంది. మరోవైపు, ‘సర్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ.. ఒక్క సీటు తేడాతోనైనా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, రాజకీయ విశ్లేషకులు మాత్రం.. మమతా బెనర్జీ కఠిన పరీక్ష ఎదుర్కోక తప్పదని భావిస్తున్నారు.


.jpg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!