

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ డిమాండ్ నెరవేరు వరకు పోరాటాన్ని ఆపేది లేదని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. ఆదివారం బాలంరాయ్‌లోని లీ ప్యాలెస్‌లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చరిత్రాత్మకమైన సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాభిప్రాయాలను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 17 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు, దీక్షలు చేపడతామని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ హాస్పిటల్, దక్షిణ మధ్య రైల్వే కార్యాలయం, క్లాక్ టవర్ వంటి చారిత్రక కట్టడాలు సికింద్రాబాద్ గొప్పతనానికి సజీవ సాక్ష్యాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు పార్టీలకు అతీతంగా ఉద్యమం కొనసాగుతుందని, అన్ని వర్గాల ప్రజలు, సంఘాలు ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!