

అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చల పై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన కొన్ని గంటల తర్వాతే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగించామని, ఇరాన్ ఒక సమగ్ర ప్రతిపాదనతో ముందుకు రావడానికి సమయం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఇరాన్ వైపు నుంచి తీవ్ర ప్రతిస్పందనల నేపథ్యంలో శాంతి చర్చలపై అనిశ్చితి పెరిగింది. హార్ముజ్ జలసంధి పరిస్థితులు, కార్గో నౌకలపై దాడులు, స్వాధీనం ఘటనలు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ, అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఓడరేవుల దిగ్బంధనాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించారు. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో, ఇరాన్ అక్రమంగా చమురు రవాణా చేస్తోందనే ఆరోపణలతో ఎమ్/టి టిఫానీ అనే చమురు ట్యాంకర్‌ను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఈ యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి. మొదటి విడత చర్చలు విఫలమైన నేపథ్యంలో, ఇప్పుడు రెండో విడత చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!