

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమపై ఎలాంటి దాడులు చేసినా, వాటికి దీటైన సమాధానం ఇవ్వాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన సైన్యానికి పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ఇరాన్ అణు సామర్థ్యాన్ని చాలా వరకు ధ్వంసం చేశామని, ఇంకా రెండు లక్ష్యాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాము నిర్ణయించుకుంటే మిగిలిన అణు సామర్థ్యాన్ని కేవలం 10 నిమిషాల్లో పూర్తిగా నాశనం చేయగలమని వ్యాఖ్యానించారు. తమ లక్ష్యాల్లో పికాక్స్ పర్వతం కూడా ఉందని వెల్లడించారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఇరాన్ నాయకత్వాన్ని తాను ఎప్పటికీ నమ్మలేనని ట్రంప్ అన్నారు. అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందనే ప్రశ్నలపై స్పందిస్తూ.. దాడి చేయాలని నిర్ణయించుకుంటే ముందుగానే అందరికీ ప్రకటిస్తామా? అని ప్రశ్నించారు.
ఇరాన్‌లోని కుహ్-ఎ కోలాంగ్ గాజ్ లా పర్వతాన్ని స్థానికంగా పికాక్స్ పర్వతం అని పిలుస్తారు. ఇది జాగ్రాస్ పర్వత శ్రేణిలో, నతాంజ్ అణు కేంద్రానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ తన అణు కార్యక్రమానికి అవసరమైన సెంట్రిఫ్యూజ్‌లను ఈ ప్రాంతంలోని భూగర్భ కేంద్రాలకు తరలించి ఉండొచ్చని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు గతంలో అనుమానించాయి. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అణు కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పికాక్స్ పర్వతాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. అయితే, ఈ స్థావరంపై అమెరికా దాడికి దిగితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!