
.avif&w=3840&q=75)
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,719 గ్రామపంచాయతీలకు మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7,093 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ 3,488 సీట్లతో తన ఉనికిని చాటుకోగా, బీజేపీ 699 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. స్వతంత్రులు 1,264 స్థానాల్లో గెలవగా, సీపీఐ 79, సీపీఐ(ఎం) 75, ఇతరులు 22 స్థానాలు దక్కించుకున్నారు.
తొలి రెండు విడతల మాదిరిగానే బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తన విజయపరంపరను కొనసాగించింది. మూడో దశలో 2,301 గ్రామపంచాయతీల్లో గెలిచి సగానికిపైగా స్థానాలను దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ దశలో 1,145 స్థానాలు గెలుచుకుని పాతిక శాతానికి పైగా సీట్లను సాధించగా, బీజేపీ కూడా గత దశల మాదిరిగానే 200 కు పైగా స్థానాల్లో విజయం నమోదు చేసింది. మొత్తం ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తరువాత ఎక్కువ స్థానాలు స్వతంత్రులు మరియు ఇతరుల ఖాతాలోనే ఉన్నాయి.
స్వతంత్రులుగా గెలిచిన వారిలో 80 శాతానికి పైగా కాంగ్రెస్ రెబల్సే కావడం గమనార్హం. గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించినప్పటికీ, కొన్ని గ్రామాల్లో స్థానిక కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలే రెబల్స్‌గా బరిలోకి దిగి సొంత పార్టీ అభ్యర్థులను ఓడించారు. ప్రమాణ స్వీకారం నాటికి వారంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరిని కూడా కలిపితే పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ వాటా సుమారు 64 శాతానికి చేరనుంది. మూడు దశల ఫలితాల ప్రకారం బీఆర్ఎస్కు 27.4 శాతం, బీజేపీకి 5.5 శాతం సర్పంచ్ స్థానాలు దక్కాయి.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!