

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనలో వారు ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి దానికి నిప్పు పెట్టడం పెద్ద సంచలనం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ సంఘటన వెనుక కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉన్న దీర్ఘకాల అసంతృప్తి కారణమని తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన రేగా కాంతారావు, ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ప్రభుత్వ విప్‌గా పదవి పొందారు. ఆయన అప్పట్లో కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక సమాచారం ప్రకారం, ఆ భూమిని ఒక కాంగ్రెస్ కార్యకర్త పార్టీపై అభిమానంతో విరాళంగా ఇచ్చి, భవనాన్ని నిర్మించినట్టు చెబుతున్నారు. అయితే కాంతారావు పార్టీ మారిన తరువాత ఆ భవనాన్ని తన సొంతంగా చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
చాలాకాలంగా కాంగ్రెస్ కార్యకర్తలు తమ కార్యాలయాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఎలాంటి చర్య తీసుకోలేకపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు కాంతారావు ఓడిపోవడం, వారిలో ధైర్యాన్ని నింపింది.
దీంతో ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి, జెండాలను పీకి పడేసి, ఫర్నీచర్‌ను బైటకు తీసి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో ఇరుపక్షాల కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల అడ్డంకికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు వాదనకు దిగారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!