

ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు సంబంధించిన కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 67 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలు అందించామని తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తులను అమెజాన్ వంటి గ్లోబల్ వేదికల ద్వారా ప్రపంచ మార్కెట్కు అనుసంధానించనున్నట్లు వెల్లడించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
మహిళల అభివృద్ధి కోసం 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇవి శిక్షణ, మార్కెటింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయి. శిల్పారామం సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన స్థలంలో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసి గ్రామీణ హస్తకళలకు ప్రోత్సాహం అందిస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి త్రైమాసిక సమావేశాలు నిర్వహిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ఉత్పత్తి, పాఠశాల నిర్వహణ, యూనిఫారాల కుట్టింపు వంటి బాధ్యతలు అప్పగించడం ద్వారా వారి పాత్రను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!