

కాంగ్రెస్ ప్రభుత్వ మూడేళ్ల పాలనలో తెలంగాణ పరిస్థితి ఆగమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులకు సరైన విద్యుత్, సాగునీరు అందడం లేదని, పాలమూరు నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నా ప్రశ్నించే వారు కరువయ్యారని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో సాగిందని, రాష్ట్ర సాధన కోసం ఆయనతో పాటు పలువురు పదవులను త్యాగం చేశారని శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు లేవని, తాగునీటి సమస్యలు కూడా తలెత్తాయని విమర్శించారు. నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!