

తెలుగుదేశం పార్టీకి 2026 మార్చి 31 నాటికి రూ.526 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆస్తుల విలువ రూ.50.10 కోట్లు పెరిగింది. మొత్తం ఆస్తుల్లో రూ.412 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉండగా, రూ.63.35 కోట్లు భూములు, భవనాలు, పరికరాల వంటి భౌతిక ఆస్తుల రూపంలో ఉన్నాయి. మరో రూ.51.37 కోట్లు రుణాలు, అడ్వాన్సులుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పార్టీకి రూ.90.64 కోట్ల ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది ఈ ఆదాయం రూ.228.31 కోట్లుగా ఉంది. తాజా ఆదాయంలో సభ్యత్వ రుసుములు, చందాల ద్వారా రూ.1.67 కోట్లు, స్వచ్ఛంద విరాళాల రూపంలో రూ.58.33 కోట్లు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీలు, ఇతర ఆదాయాల ద్వారా రూ.30.63 కోట్లు సమకూరాయి.
ఆర్థిక సంవత్సరంలో పార్టీ మొత్తం రూ.74.28 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో ఎన్నికల కోసం రూ.16.52 కోట్లు వెచ్చించగా, విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి అత్యధికంగా రూ.10.02 కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ నివేదిక తెలిపింది. పరిపాలన, సాధారణ ఖర్చుల కింద రూ.51.57 కోట్లు వ్యయమయ్యాయి. ఇందులో పార్టీ కార్యకర్తల గ్రూప్ ఇన్సూరెన్స్ కోసం రూ.46.25 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాది ఈ బీమా కోసం రూ.15.84 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.51.97 లక్షలు, ఆర్థిక వ్యయాల కింద రూ.1.40 కోట్లు, తరుగుదల కింద రూ.4.26 కోట్లు వెచ్చించినట్లు నివేదిక వెల్లడించింది. ఆదాయం, ఖర్చుల అనంతరం మిగిలిన రూ.16.35 కోట్లను పార్టీ జనరల్ ఫండ్‌లో జమ చేసినట్లు తెలిపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!