

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ భూదోపిడీపై సీఎం రేవంత్ రెడ్డి గంటల తరబడి మాట్లాడటం ప్రజల కోసం కాదని, ఏఐసీసీకి నిధులు సమకూర్చుకునేందుకేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భూవ్యవహారాలపై ఆధారాలు ఉన్నాయని సీఎం చెబుతున్నప్పుడు, వెంటనే చర్యలు తీసుకోకుండా ప్రత్యేక విచారణ కమిషన్లు, సిట్, సెట్ పేరుతో జాప్యం చేయడం వెనుక ఉద్దేశమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలతో ప్రభుత్వం బేరసారాలు చేస్తోందని కూడా ఆయన ఆరోపించారు.
కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల భూస్వామి అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఎకరం భూమి కూడా లేదని పేర్కొన్నారని, అలాంటప్పుడు ప్రస్తుతం ఉన్న భూములు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అలాగే నిజాం పాలనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. నిజాం గొప్పవాడైతే సర్దార్ పటేల్, నెహ్రూ ప్రభుత్వం సైన్యాన్ని ఎందుకు పంపాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పర ఆరోపణలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాయని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!