

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో పాటు ఈ ఏడాది మరోసారి రేట్ల పెంపు ఉండొచ్చన్న సంకేతాలు ఇవ్వడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 21.86 పాయింట్లు నష్టపోయి 74,314.59 వద్ద ముగియగా, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 23,270.60 వద్ద స్థిరపడింది. మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు తొలి రోజే 43 శాతం స్పందన లభించింది. మొత్తం 8.86 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా, తొలి రోజు 3.83 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
బెంగళూరుకు చెందిన ఏ-వన్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్ రూ.405 కోట్ల ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.385-405గా నిర్ణయించింది. ఈ నెల 24న ప్రారంభమై 28న ముగిసే ఈ ఇష్యూలో రూ.355 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుండగా, ఓఎఫ్‌ఎస్ ద్వారా ప్రమోటర్లు రూ.50 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆక్సియమ్ గ్యాస్ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఎస్‌ఎంఈ ఐపీఓ శుక్రవారం ప్రారంభమై 22న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ.50.75 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరను రూ.51-54గా నిర్ణయించగా, యాంకర్ ఇన్వెస్టర్లకు 10.70 లక్షల షేర్లను ఒక్కోటి రూ.54 చొప్పున విక్రయించి రూ.5.77 కోట్లు సమీకరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!