

మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు బయటకు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఇంకా ఎందుకు అంగీకరించడం లేదని, మంత్రి నారా లోకేశ్‌తో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. అధికార బలాన్ని, ప్రచారాన్ని ఉపయోగించి బాధ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
టెట్‌లో 75 మార్కులు రావాల్సిన అభ్యర్థికి 65 మార్కులు వచ్చినప్పటికీ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఎలా ఇచ్చారని జగన్ ప్రశ్నించారు. వన్-టు-వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత కూడా అర్హత లేదని తెలిసినా ఉద్యోగం ఎలా కల్పించారని నిలదీశారు. అటవీశాఖలో 814 ఉద్యోగాల భర్తీలోనూ ఇదే విధానం అమలు చేశారని, డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి రావడంతో ఆ నియామక ప్రక్రియను మధ్యలో నిలిపివేశారని ఆరోపించారు. మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా వైఎస్సార్‌సీపీ కోర్టులో పోరాడుతోందని, యువతకు ఎప్పుడూ అండగా ఉంటుందని జగన్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!